బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Monday, October 4, 2010

వరాన్వేషణ




ప్రవరాఖ్యుడు కాకపోయినా
ఫరవా లేదనిపించాలి
కుబేరుడు కాకపోయినా
నగలను కుదవబెట్టనివాడు కావాలి
సత్యవంతుడు కాకపోయినా
నిత్య సంతోషితుడూ
మా అమ్మాయికి హితుడు, సన్నిహితుడు కావాలి

మోహించేవాడే తప్ప
దహించేవాడక్కరలేదు
ముఖాన్ని ముద్దులాడాలి కానీ
మొహం మీద యాసిడ్ పోసేవాడు వద్దు
పంచభక్ష్యాలు పెట్టకపోయినా
కంచంలో ముద్దల్ని కలిపి పెట్టేవాడు కావాలి
కాకరకాయ కూరనైనా
కళ్లకద్దుకుని తినే తీపి మనసువాడు కావాలి

నడివీధిలో విడిచే బండజాతివాడు కాదు
గుండెల్లో దాచుకునే దయ్రార్దహృదయుడు కావాలి
తేనీటిని కన్నీటిని చెరిసగంగా
పంచుకునే రాజహంస కావాలి
మంటల్లో తగలబెట్టేవాడు కాదు
మా అమ్మాయి వెన్నెల విరహాగ్నిని చల్లబరిచేవాడు కావాలి

ఎప్పుడూ డబ్బు లెక్కపెట్టేవాడు కాదు
అప్పుడప్పుడు ఆరుబయట
మల్లెపూల కళ్లతో నక్షత్రాలు గుణించేవాడు కావాలి
కొంచెం సంగీతం తెలియాలి
ఇంకొంచెం సాహిత్యం చదవాలి
మా అమ్మాయి ప్రతి సమయాన్ని రసమయం చేయాలి

ఎప్పుడైనా
మా అమ్మాయి ఎడమకాలితో తన్నినా
ఏమీ అనుకోని సరసుడు కావాలి
ఏడడుగుల బంధంతో ఏడిపించేవాడు కాదు
ఎప్పుడూ నవ్వించే స్నేహితుడు కావాలి
అబ్రహాము శారాల్లా
అపురూప దంపతుల్లా ఉండాలి
ఒక జీవితకాలం తోడుగా నిలవాలి

మా అమ్మాయితో కలసి జీవించేవాడే కాదు
నవ్వుతూ నరకానికైనా వెళ్లేవాడు కావాలి
మా అమ్మాయిని ముంతాజ్‌లా చూసుకోకపోయినా
అనార్కలీలా సజీవ సమాధి చేయనివాడు కావాలి
పిడికిట తలంబ్రాలు పట్టేవాడే తప్ప
కత్తులు కటారులు పట్టే కసాయి కాకూడదు
ధారణాయంత్ర ధురీణుడు కాకపోయినా
సాధారణ ఉద్యోగియైనా అభ్యంతరం లేదు
అమెరికా వాడో
ఐరోపావాడో అక్కర్లేదు
తెలుగువాడైతే చాలు
మీ దృష్టిలో ఎవరైనా ఉంటే
మా అమ్మాయికి సరిపడే
వరుణ్ణి వెతికి తెస్తారా
వంద వచన కవితల సంపుటి అంకితమిస్తాను
ఇన్ని మాటలెందుకుగానీ
మా అమ్మాయిని భరించే మంచి బకరా కావాలి

- ఎండ్లూరి సుధాకర్

ఆదివారం  ఆంధ్ర జ్యోతి అనుబంధం  3 .10 .2010