Saturday, February 21, 2009
నజరానా (ఉర్దూ కవితలు)-5
*మొత్తం ఆ వీధికంతా
నా ఒక్క కొంప లోనే దీపం లేంది
ఆ చీకటే చాలు నీకు
నా చిరునామా చెప్పేస్తుంది.
- బాకీ అహమద్ పురీ
*తెల్లారిపోయినా ఆ కొవ్వొత్తి
ఇంకా ఏడుస్తుంది దేనికని ?
"ఇంకొద్దిగా మిగిలాను
ఇది కూడా కరిగిపోవాలని"
-ఆగ్ జాన్ 'ఏష్ '
*ఆమె నగ్నసౌందర్యం మీద
పరుచుకున్నాయి కురులు
ఒకే సారి ఉదయించాయి
రేయీ మరియూ పవలూ
- హీరాలాల్ పలక్
*'మనసు ఎలా వుంటోందని '
ఆమె నవ్వుతూ అడిగింది
ఒక కన్నీటి చుక్క దొరలి
అలా నిలిచి పోయింది.
-మహిరూల్ కాదరీ
*ఎలాగైతేనేం? ఆమె కళ్ళు
అశ్రు బిందువులు వర్షించాయి
ఆమె చిరు నవ్వుల బరువు కూడా
ఆ నయనాలు మోయలేక పోయాయి
-ఖామోష్
*వెన్నెలని చూసుకునే కదా
చంద్ర బింబం మిడిసి పడుతోంది
ప్రియా! ఒక్క సారి
నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .
-సాహిల్ మానక్ పురీ
-తెలుగు అనువాదం :ఎండ్లూరి సుదాకర్
Monday, February 9, 2009
నజరానా(ఉర్దూ కవితలు)-4
*నేను అనుకునే వాణ్ణి
ప్రేమంటే ఫ్రణయ కలాపం
ఆ తరువాత తెలిసింది
అది ఒక రుధిర విలాపం .
-అసర్ లఖ్నవీ
*చాలా అందమైనవి నీ కళ్ళు
తెల్లవార్లూ మేలుకోకు
సహజ నిద్ర పడుతుందిలే
నా ఆలోచన రానీయకు .
_హసన్ కాజ్మీ
*ఈడ్చుకొని వెళ్ళింది
మనసు నీ దగ్గరికి
ఏం చెప్పాలో చెప్పు ?
అది చేసిన పిచ్చి పనికి .
_ రషీద్ సిద్ధిఖీ
*హాయిగా ఏడ్చుకునే
స్వేచ్ఛ కావాలి ఫానీ
ఇది ఆమె వుండే వీధి
తెలుసుకో !నీ దు:ఖశాల కాదని .
_ఫానీ
*బహుశా వైద్యంతోనైనా
కుదురుకుంటుందేమో చావు
కానీ జీవితాన్ని మాత్రం
బాగు చేసే మందులేవీ లేవు.
_ఫిరాఖ్
*నా పేరు నేల మీద రాసి
మళ్ళీ చెరిపేసింది
ఆమెకది ఒక ఆట
కడకదే నన్ను మట్టి పాలు చేసింది.
-నవాజ్ మహల్ అఖ్తర్
-తెలుగు అనువాదం :ఎండ్లూరి సుధాకర్
Saturday, February 7, 2009
చెరువు లేని ఊరు
అమ్మ లేని అనాధలా
మా ఊరికి చెరువు లేదు
చిన్నప్పుడు
చెరువు చెక్కిళ్ళని ముద్దు పెట్టుకున్న
నీటి జ్ఞాపకాలు కానీ
నీటి మైదానంలో దిసమొలతో
పరుగెత్తిన గాఢ స్మృతులు కానీ
జల వృక్షమెక్కి అలల ఆకుల నడుమ
పిందెలా కదిలిన బాల్య్యానుభూతులు కానీ లేవు.
చెరువు పలక మీద
జలాక్షరాలు దిద్దుకోవాలని
చిన్నప్పుడు ఎంత పలవరించామో
మబ్బుల ఊరేగింపు బయలుదేరినప్పుడల్లా
ఉరుములతో గొంతు కలిపి
ఆరు బయట నీటి నినాదాలు చేసేవాళ్ళం .
జలజలా రాలే తొలకరి చినుకుల్ని
మట్టి నాల్కలు చాపి
పిప్పరమెంటు బిళ్ళళ్లా చప్పరించే
చెరువు మా బాల్య జలస్వప్నం
ఆకాశం కొలిమిగా మారిన అగ్ని రుతువులో
ఒక చెరువు కోసం
ఒక చెలమ కోసం
బొబ్బలెక్కిన కాళ్ళతో కాందిశీకులమయ్యే వాళ్లం
బెత్తికలెత్తి దూపగొన్న మా బతుకులకు
గుక్కెడు మంచినీళ్ళు కూడాదొరికేవికావు
మా గురయ్య తాత కళ్ల గుంటల్లా
'రెండు ' దిగుడుబావులు మాత్రం
దిగులు దిగులుగా కనబడుతుండేవి
ఆకాశం వైపు చేతులు మోడ్చి
మాకో చెరువునియ్యమని ప్రార్ధించాం
భగీరధులమై జలాగ్రహం చేశాం .
ఆకాశం లోకి విల్లు సారించి
మేఘ భాండాల్ని బద్దలు చేయాలనుకున్నాం
రోళ్ళకి కప్పలు కట్టి నీటి పూజలు చేస్తే
వర్షం పడుతుందనుకునే వెర్రి బాల్యం మాది.
ఎప్పుడైనా వర్షమొచ్చిన పొద్దు
మా వూరు జల ప్రవాహపు జాతరవుతుంది .
మళ్లీ మరునాటికి బురద మొహంతో నెర్రలు తీస్తుంది.
ఒకే ఒక్క కుంభవర్షపు తుఫాను రాత్రి
నిజంగానే మా వూరు చెరువయ్యింది.
గుడిసెల మెడల దాకా వూరు మునిగినా
చెరువు ఉయ్యాల లో తేలుతూ
మా కడుపుల్ని చెరువు చేసుకున్నాం .
నిండు నీటిలో మేమంతా
తాబేళ్ళమయ్యాం
కొరమీనులమయ్యాం
చందమామ బేడిస చేపలమయ్యాం
నెమ్మది నెమ్మదిగా చెరువెండిపోతుంటే
అమ్మ దగ్గర పాలైపోయినట్టు మూగ వోయాం
మా వూరు గుర్తుకొచ్చి
నా బాల్యం వీపు నిమిరినప్పుడల్లా
నా తాతముత్తాతల నాటి
మెట్ట పొలం కళ్ళల్లో కదిలినప్పుడల్లా
చెరువు లేని నా పల్లె రూపం
నన్ను నిలువెల్లా నీరు గా మార్చేస్తుంది.
నన్ను చెరువుగా మారమని
మట్టి గొంతుతో నినదిస్తూ వుంటుంది.
-ఎండ్లూరి సుధాకర్
(వర్తమానం నుంచి)
Subscribe to:
Posts (Atom)