బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Friday, March 20, 2009

నజరానా(ఉర్దూ కవితలు)


*బతుకంతా నీ కోసం

పరితపిస్తూ జీవించా

ఎదురు చూపులు చూస్తూ

ఎందరినో ప్రేమించా

-హఫీజ్ హొషియార్ పురీ


*ఆకులకీ గడ్డి పరకలకీ

అవగతమే నా దుస్థితి

తోటకంతా తెలుసు గానీ

తెలియందల్లా పూలకే నా గతి


_ మీర్ తకీ మీర్


*నా కన్నీటి కబురు

ఆమె చెవిదాకా ఎవరు చేర్చారు?

నా గుండె గుట్టు నలుగురిలో

ఎవరు సుమా రచ్చకీడ్చారు ?

_నాతిక్ గులావఠీ


తెలుగు అనువాదం :డా.ఎండ్లూరి సుధాకర్

Friday, March 6, 2009

దు:ఖ గంధకికామ్ల వర్షం



ఈ మధ్య గమనిస్తున్నాను

మా అమ్మాయిలు అదోలా ఉంటున్నారు

భద్రంగా ఉన్నట్టులేరు

ఏ యువకుడు కనబడినా

ఏ వాహన శబ్దం వినబడినా

ఊరికే ఉలిక్కి పడుతున్నారు

పులిని చూసిన జింకల్లా బెదిరిపోతున్నారు

బజారుకెళ్లాలంటే భయపడుతున్నారు

కాలేజీ కెళ్లమంటే కంగారు పడుతున్నారు

కారణాలడిగితే కన్నీటి మేఘాలౌతున్నారు

ఆకాశం ప్రతిధ్వనించేలా నవ్విన వాళ్లు

గలగల గోదారిలా మాట్లాడిన వాళ్లు

నీరింకిన చలమలౌతున్నారు

మేత ముట్టని దూడల్లా

మెత్తబడుతున్నారు

ఏ దిగులు తీగలకో చిక్కుకొని

పగలూ రాత్రీ కునారిల్లుతున్నారు

రోజుకు నాలుగు సార్లు

బండితీసి చక్కర్లు కొట్టేవాళ్లు

స్నేహితుల్ని వెనకెక్కించుకొని

వీథుల్ని వీర విహారం చేసేవాళ్లు

రెండు పదుల వయసొచ్చినా

మా కంటికి రెండేళ్ల పిల్లల్లాగే కనిపిస్తారు

యవ్వనపు టెన్నిస్ కోర్టులో

సానియా మీర్జాలా

దర్జాగా ఆడుకుంటూ కనిపిస్తారు

ఇప్పుడు పెద్దగా బైటికెళ్లడం లేదు

ఇంటిపట్టునే ఉండిపోతున్నారు

వార్తలు చూస్తే చాలు

వణికి పోతున్నారు

కాలిన గొంతులు వినబడితే

కంటతడి పెడుతున్నారు

మా అమ్మాయిల్ని చూస్తే

మహా బెంగగా ఉంది

అమ్మా! ఏం కావాలో చెప్పండి

మీకేం తేవాలో అడగండని

గుచ్చి గుచ్చి ఆరాతీస్తే

గుడ్లల్లో నీళ్లు గుక్కుకుంటూ

ఇలా అన్నారు.

"నాన్నా!

మాకు యాసిడ్ ప్రూఫ్ ముఖాలు కావాలి

తెచ్చిపెట్టగలవా?!...''



-ఎండ్లూరి సుధాకర్