
ఈ మధ్య గమనిస్తున్నాను
మా అమ్మాయిలు అదోలా ఉంటున్నారు
భద్రంగా ఉన్నట్టులేరు
ఏ యువకుడు కనబడినా
ఏ వాహన శబ్దం వినబడినా
ఊరికే ఉలిక్కి పడుతున్నారు
పులిని చూసిన జింకల్లా బెదిరిపోతున్నారు
బజారుకెళ్లాలంటే భయపడుతున్నారు
కాలేజీ కెళ్లమంటే కంగారు పడుతున్నారు
కారణాలడిగితే కన్నీటి మేఘాలౌతున్నారు
ఆకాశం ప్రతిధ్వనించేలా నవ్విన వాళ్లు
గలగల గోదారిలా మాట్లాడిన వాళ్లు
నీరింకిన చలమలౌతున్నారు
మేత ముట్టని దూడల్లా
మెత్తబడుతున్నారు
ఏ దిగులు తీగలకో చిక్కుకొని
పగలూ రాత్రీ కునారిల్లుతున్నారు
రోజుకు నాలుగు సార్లు
బండితీసి చక్కర్లు కొట్టేవాళ్లు
స్నేహితుల్ని వెనకెక్కించుకొని
వీథుల్ని వీర విహారం చేసేవాళ్లు
రెండు పదుల వయసొచ్చినా
మా కంటికి రెండేళ్ల పిల్లల్లాగే కనిపిస్తారు
యవ్వనపు టెన్నిస్ కోర్టులో
సానియా మీర్జాలా
దర్జాగా ఆడుకుంటూ కనిపిస్తారు
ఇప్పుడు పెద్దగా బైటికెళ్లడం లేదు
ఇంటిపట్టునే ఉండిపోతున్నారు
వార్తలు చూస్తే చాలు
వణికి పోతున్నారు
కాలిన గొంతులు వినబడితే
కంటతడి పెడుతున్నారు
మా అమ్మాయిల్ని చూస్తే
మహా బెంగగా ఉంది
అమ్మా! ఏం కావాలో చెప్పండి
మీకేం తేవాలో అడగండని
గుచ్చి గుచ్చి ఆరాతీస్తే
గుడ్లల్లో నీళ్లు గుక్కుకుంటూ
ఇలా అన్నారు.
"నాన్నా!
మాకు యాసిడ్ ప్రూఫ్ ముఖాలు కావాలి
తెచ్చిపెట్టగలవా?!...''
-ఎండ్లూరి సుధాకర్
7 comments:
డా// ఎండ్లూరి గారికి నమస్కారం,
మీ ప్రతి కవితా హృదయాన్ని కదిలించేస్తుంది. సమకాలీన సమస్యలన్నింటికీ వెంటనే స్పందించే మీ కవితా స్పూర్తి నిజాంకి మాకెంతగానో ప్రేరణ.
మీ
దార్ల
హలో ఎండ్లూరిగారూ,
యాసిడ్ ప్రూఫ్ మొహాలే కాదు, మనసులూ కావాలి అమ్మాయిలకి. మీ ఆటా జని కాంచె.. కూడా బావుంది.
అబ్బ!
గురువుగారూ,
నమస్తే
మెట్లు మెట్లుగా పైకెక్కి, దబ్బున క్రిందపడింది హృదయం.
కవిత పూర్తయ్యేసరికి హృదయమంతా గాయాలు.
మంచి ఊహ, వాస్తవపరిస్థితుల చిత్రణ.
అద్బుతం సార్
బొల్లోజు బాబా
ఎన్ని యాసిడ్ ప్రూఫ్ ముఖాలు పెట్టుకున్నా, ఎంత కొడవలి ప్రూఫ్ కంఠాలు పెట్టుకున్నా, ఎన్ని కత్తి / గొడ్డలి ప్రూఫ్ శరీరాలు తయారుచేసుకున్నా పిల్లల భయం తీరదు ! మదపిచ్చి, క్రూరత్వం, చంచలత్వం వంటి భావాలను నెమ్మది నెమ్మదిగా పెంచుకొంటూ పోతున్న యువతరం వారి స్వేచ్చకున్న అర్ధాన్ని సరిగా గుర్తించక, దానవత్వాన్ని కాదు మనం పొందాల్సింది మానవత్వాన్ని అని గుర్తించనంత వరకూ ఈ పిల్లల గృహ నిర్భందం ఇంతే ! చక్కని సామాజిక స్పృహ వున్న కవితకు నా ధన్యవాదాలు !
"దు:ఖ గంధకికామ్ల వర్షం" kavita pai tama pratispanadanalu telipina mitrulandariki na dhanyavadalu..
నాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసాడు ఎవరా అని అతని పేరు ని గూగుల్ లో ఉంచాను తెలిసింది ఏమిటి అంటే అతను ఒక కవిత హృదయుడు అని .................................
మీ భావం నచ్చింది మీ ఫీలింగ్స్ అర్ధం చేసుకునాను...........
మే భావం లో సోలుషన్ కూడా ఉంటె బగుంద్తుంది
మీ ఫోన్ స్నేహితుడు
adibabu
Post a Comment