ప్రవరాఖ్యుడు కాకపోయినా
ఫరవా లేదనిపించాలి
కుబేరుడు కాకపోయినా
నగలను కుదవబెట్టనివాడు కావాలి
సత్యవంతుడు కాకపోయినా
నిత్య సంతోషితుడూ
మా అమ్మాయికి హితుడు, సన్నిహితుడు కావాలి
మోహించేవాడే తప్ప
దహించేవాడక్కరలేదు
ముఖాన్ని ముద్దులాడాలి కానీ
మొహం మీద యాసిడ్ పోసేవాడు వద్దు
పంచభక్ష్యాలు పెట్టకపోయినా
కంచంలో ముద్దల్ని కలిపి పెట్టేవాడు కావాలి
కాకరకాయ కూరనైనా
కళ్లకద్దుకుని తినే తీపి మనసువాడు కావాలి
నడివీధిలో విడిచే బండజాతివాడు కాదు
గుండెల్లో దాచుకునే దయ్రార్దహృదయుడు కావాలి
తేనీటిని కన్నీటిని చెరిసగంగా
పంచుకునే రాజహంస కావాలి
మంటల్లో తగలబెట్టేవాడు కాదు
మా అమ్మాయి వెన్నెల విరహాగ్నిని చల్లబరిచేవాడు కావాలి
ఎప్పుడూ డబ్బు లెక్కపెట్టేవాడు కాదు
అప్పుడప్పుడు ఆరుబయట
మల్లెపూల కళ్లతో నక్షత్రాలు గుణించేవాడు కావాలి
కొంచెం సంగీతం తెలియాలి
ఇంకొంచెం సాహిత్యం చదవాలి
మా అమ్మాయి ప్రతి సమయాన్ని రసమయం చేయాలి
ఎప్పుడైనా
మా అమ్మాయి ఎడమకాలితో తన్నినా
ఏమీ అనుకోని సరసుడు కావాలి
ఏడడుగుల బంధంతో ఏడిపించేవాడు కాదు
ఎప్పుడూ నవ్వించే స్నేహితుడు కావాలి
అబ్రహాము శారాల్లా
అపురూప దంపతుల్లా ఉండాలి
ఒక జీవితకాలం తోడుగా నిలవాలి
మా అమ్మాయితో కలసి జీవించేవాడే కాదు
నవ్వుతూ నరకానికైనా వెళ్లేవాడు కావాలి
మా అమ్మాయిని ముంతాజ్లా చూసుకోకపోయినా
అనార్కలీలా సజీవ సమాధి చేయనివాడు కావాలి
పిడికిట తలంబ్రాలు పట్టేవాడే తప్ప
కత్తులు కటారులు పట్టే కసాయి కాకూడదు
ధారణాయంత్ర ధురీణుడు కాకపోయినా
సాధారణ ఉద్యోగియైనా అభ్యంతరం లేదు
అమెరికా వాడో
ఐరోపావాడో అక్కర్లేదు
తెలుగువాడైతే చాలు
మీ దృష్టిలో ఎవరైనా ఉంటే
మా అమ్మాయికి సరిపడే
వరుణ్ణి వెతికి తెస్తారా
వంద వచన కవితల సంపుటి అంకితమిస్తాను
ఇన్ని మాటలెందుకుగానీ
మా అమ్మాయిని భరించే మంచి బకరా కావాలి
- ఎండ్లూరి సుధాకర్
ఆదివారం ఆంధ్ర జ్యోతి అనుబంధం 3 .10 .2010
9 comments:
శిర్,
మీ పద్యం చదివేను. చాలా simpleగా బావుంది.
ఇంత simple పద్యం ఈ post modern, post de- construction,Post Deruda, Post XXX, post YYY యుగంలో రాసినందుకు అభినందనలు. complexity, abstraction లేకపోతే కవిత్వం కాదేమోనని అనుమానం వస్తున్న రోజుల్లో మీ పద్యం అత్మీయంగా పలకరించింది. అలా అని పద్యం అంతా నచ్చిందని కాదు. మీకు చెప్పగలిగినంతటి వాడిని కాదు గాని ఎందుకో కొన్ని చోట్ల పద్యం integrity కోల్పొయిందనిపించింది. ముఖ్యంగా చివరి వాక్యం మిగిలిన పద్యంతో syncలో లేదనిపించింది . build up చేసిన tempo చివరి వాక్యంతో కొంచం పలుచబడిందనిపించింది. బహుశ నా కూతురి (అదింకా చంటిది లెండి) ని మనసులో పెట్టుకుని చదవడం వల్ల "బకరా" అన్న పదం నన్ను hurt చేసి ఉండొచ్ఛు కూడా.
ఏమైనా, మరోక్కసారి అభినందనలు.
beekay
వరుడి క్వాలిటీస్ అడిగారు వధువు గుణ గణాలు చెప్పనే లేదు :)
శ్రీ సుధాకర్ గారూ, మీ "వరాణ్వేషణ" చాలా బాగుంది.
ప్రతి మాట అద్భుతం! ధన్యవాదాలు.
surekhacartoons.blogspot.com
ఆ మధ్య ఎప్పుడో మీరు లేడీస్ హాస్టల్ గురించి రాశారు, మీ అమ్మాయి ని తల్చుకుంటూనే! ఎంతగానో నచ్చిన కవిత!
అంత పెద్దదైపోయిందన్నమాట అప్పుడే, వరాన్వేషణ దాకా వచ్చారంటే!
ప్రతి అమ్మాయీ కోరుకునే వరుడిని మీరు మీ కళ్లతో వెదికారు!
మీ వచన కవితలు మీ నుంచి అందుకోడానికైనా( అంకితం అక్కర్లేదండీ, మీ చేత్తో ఇస్తే చాలు) మీ అమ్మాయికి వరుడిని వెదకాలని ఉందికానీ ఇన్ని క్వాలిటీలంటే ఈ రోజుల్లో మాటలా!
మా అమ్మాయి పెళ్ళీడుకొచ్చే సరికి ఈ కవితనే వల్లె వేస్తానేమో మరి నేను కూడా!
చివరి లైను మీ ముద్దుల పట్టిని మీరెంత గారాబం చేస్తారో చెప్పింది. మీరు వెదికే మీ "మంచి బకరా" మీ అమ్మాయికి త్వరలోనే దొరకాలని....!
ఎంతో అద్భుతంగా, తీపి మమతల మాలికలా ఉంది వరాన్వేషణ!
మీ వరాన్వేషణ లోని అర్హతలన్నీ వున్న వరుడు ఈ ఇ-యుగంలో దొరకటమంటే చందమామలో చల్లని నీరు దొరకటం కన్నా దుర్లభమే మో నండి!అయినా అసాధ్యం మాత్రం కదేమొలెండి!ఆ beeekay గారు చెప్పినట్లు ఈ post-modern, post deconstruction etc...etc యుగం లో కూడా ఒక గొప్ప కవి ఇంత అసాధారణమయిన భావాన్ని ఒక వేమన లాగా అతి సాధారణమయిన పదాలలో పెట్టినప్పుడు ఇది మాత్రం ఎందుకు సాధ్యమవదు? కానీ చివర మీరు వాడిన ఆ 'బకరా' అన్న పదం తో భావ గాంభీర్యత చెదిరి పోయిందన్నదే ఒక్క బాధ.అయినా కవిత మీద మీ ముద్ర చెదర లేదన్న తృప్తి మిగిలింది.మొత్త్తం మీద బావుంది.
బకరా కావాలి అనేసి బకరాలకు హింట్ ఇచ్చేస్తే ఎలా సార్ ?
ఇన్ని లక్షణాలు ఉన్నోడు.. అందునా తెలుగోడు దొరుకుతాడు అంటారా.. అదె మీరు ముద్దుగా పిలిచే బకరా...
మీ ఈ కవిత ఆదివారం ఆంధ్రజ్యోతి లో ఆ రోజే చదివానండి.. ఆ రోజు మీ కవితకు naaamaata ను మీ మొబైల్ కు మెసేజ్ కూడా చేసినట్లు గుర్తు..
meeku ammayiga puttina ammayi chala adrushtavanturalu
sir,
all the best ,
meeru korina varudu dorakalani akamkshistunna !
మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తోంది.
Post a Comment