ఇచ్చోటనే కదా !
నీ చక్కని విగ్రహం
ముక్కలై పోయింది
నీ విగ్రహమే కాదు
కారల్ మార్క్స్ బొమ్మని కూల గొట్టి
కాలు పెట్టిన వాడి కాళ్ళకు
అమెరికా నమస్కరించినట్టుంది
గబ్బిలాన్ని పట్టుకుని రెక్కలు విరిచి
ముక్కలు చేసినట్టుంది
నువ్వు వినుకొండలో ఉండకుండా
ట్యాంకు బండు దాకా ఎందుకొచ్చావు?
రోమ్ లాంటి నగరం
తగల బడటానికే తప్ప
తల దాచుకోవటానికి కాదు
నగరం లో రాతి విగ్రహమై
'నవయుగ కవి చక్రవర్తి' వై
సగర్వంగా జీవిస్తున్నావనుకున్నాను
దిక్కులేకుండా దీనంగా
దెబ్బతింటావనుకోలేదు
నీ 'ఫిరదౌసి' బతికుంటే
కంట నీరు పెట్టుకుని
మసీదు గోడల మీద కాదు
ఉస్మానియా విశ్వ విద్యాలయ కుడ్యాల మీద
విషాద పద్యాలు రాసి ఉండేవాడు
నిన్ను కూల గొట్టిన కులీను డెవడో
కుల హీనుడెవడో
తెలిసినవాడే
తెలుగు వాడే అయ్యుంటాడు
ప్రజల నాల్కల మీద
పట్టం కట్టుకున్న పాదుషా!
అభిమానుల గుండెల్లో
ఆకాశమంత పద్యమై నిలిచిన
నీ అక్షర రూపాన్ని ఎవడు కూలగొట్ట గలడు?
వంద గొంతులు పిసికి
వందన సమర్పణ చేసే వాడెవడో
నీ మీద చెయ్యి చేసుకుని ఉంటాడు
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యపు
ఏకైక దళిత ప్రతినిధివైన నీ మీద
దానయ్య ఎవడో దాడి చేసి ఉంటాడు
వీళ్ళేం చేస్తున్నారో
వీళ్ళకు తెలియదు కనక
విశ్వ నరుడా !
వీళ్ళను క్షమించు
రాలింది రాతి ముక్క మాత్రమే
బాధ పడకు జాషువా !
బంగారు విగ్రహం పెట్టే రోజొస్తుంది.
- ఎండ్లూరి సుధాకర్
(10.3.2011 నాడు, హైదరాబాదు ట్యాంకు బండు మీద 'కవికోకిల గుర్రం జాషువా' విగ్రహం కూలగొట్టిన
నేపధ్యం లో ...)