నన్నొక మొక్కను చేయండి 
మీ ఇంటిముందు పువ్వునవుతాను 
నన్ను ఊయలలూపి చూడండి 
మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను 
నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి 
ముక్కోటి దేవతలతో 
విసిగిపోయాను 
వెలివేయబడ్డాను 
నన్నొక గోడను చేయండి 
ఒక వాక్యమై నిలదీస్తాను 
నన్నొక పిడికిలి చేయండి 
నలుగురి కోసం నినదిస్తాను 
నన్ను మతాల మంత్రనగరికి పంపకండి 
నన్ను తీవ్రవాదిని చేసి చంపకండి 
నా చుట్టూ గిరి గీయకండి 
నేనెవరి గూట్లో ఇమడలేను 
నన్నొక అడవిలో వదిలేయండి 
అగ్నిపూల వనమవుతాను 
సీతాకోక చిలుకల రెక్కలు విరిచి 
స్వేచ్చ గురించి మాట్లాడకండి 
నన్ను కొత్త కోకిలను చేయండి 
చైతన్య చైత్ర గీతమవుతాను 
నా హక్కుల గొంతు కోయకండి 
నా పాటల పురిటి నొప్పులు వినండి 
నన్ను జైల్లో బంధించకండి 
నేనీ దేశపు ఆత్మగౌరవాన్ని !
నా కలాన్ని విరిచేయకండి 
నేనొక కలలుగనే అక్షరాన్ని 
నన్ను హిమాలయాల మీద చూడండి 
నేనొక జెండానై రెప రెపలాడతాను 
-ఎండ్లూరి సుధాకర్
March 2016
నవ్య వార పత్రిక (ఆంధ్రజ్యోతి)
 
 
No comments:
Post a Comment