
మౌన బాల్యానికి వాడొక ప్రతీక 
తన చిన్ని ప్రపంచాన్ని ఒంటరి గా చప్పరిస్తూ
శృతి పేటిక పై ఊగుతూనో 
హార్మోనియం రెక్క లాగుతూనో 
నిదుర పోగుల్ని లోలోపల ముడి వేసుకుంటూ
విసన కర్రలా అటూ ఇటూ జోగుతూ 
రే పగళ్ళ తాడు మీద స్వర ప్రస్తారం చేస్తుంటాడు
రాత్రి ముహూర్తాలు ఆకలిని మంట కలుపుతాయి 
సైనికుని టెలిగ్రాం లా హడావుడి ప్రయాణం 
దూర దూరాలకు చేరుకోక తప్పదు
భుజానికి స్కూలు సంచీలా 
మెడలో సుతి పెట్టె 
చినిగిన చొక్కా నిక్కరుతో 
చిన్న పంచె ముక్కతో 
ముడి వేసిన జుట్టుతో 
నిలువు బొట్టుతో
పెండ్లి మేళంలో వృద్ధ బాలుడిలా కనిపిస్తాడు
చిగురు పాదాల మీద కాయలు కాచిన గుర్తులు 
ఎండిన జొన్న రొట్టెలాంటి బుగ్గల మీద 
పేరుకుపోయిన దు:ఖపు చారికలు
పిల్లలంతా కేరింతల ఆకాశం మీద 
రంగు రంగుల గాలి పటాలై తేలిపోతుంటే 
వాడు దిగులు బొంగరమై 
తనలో తనే తిరుగుతుంటాడు .
-ఎండ్లూరి సుధాకర్ 
 
 
No comments:
Post a Comment