బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Tuesday, January 20, 2009

నాలుగు నల్ల కవితలు






నల్లవాడా!


నల్లవాడా!


నల్లవాడలోని పిల్ల వాడా


నీలి వజ్రాల నిగనిగల కళ్ళ వాడా!


ఘెట్టోలలో - చీకటి


కొట్టాలలో


బానిస బంధాలలో


గాఢాందకారాలలో


శతాబ్దాలు మగ్గిన వాడా


పోరు చేసి నెగ్గిన వాడా


నిగ్గరుగా


బిగ్గరుగా


పిలవబడిన వాడా


నల్ల రేగడి పోర గాడా


ఏ నాటికైనా


అమెరికాను శాసిస్తావు


బహుశా నువ్వే


శాశ్వతంగా పరిపాలిస్తావు.



*ఘెట్టో - మన వెలి వాడ వంటిది




నీలీ!


పింఛా లాంఛిత


అసిత కిరణ రింఛోళీ


నడిచే నా నల్లకలువల దండా!


నిన్ను నిగ్గర్


అన్నవాడే బెగ్గర్


డార్కీ


నీ అందం


నల్ల సముద్రం మీద


లేత చంద్రోదయం ...


*రింఛోళీ -సమూహం




ఎవరన్నారో గానీ


ఈ వైట్ హౌస్ కి


బ్లాక్ పెయింట్ వేస్తే


భలేగుంటుంది


ఏ నల్లని వాడో


పద్మనయనమ్ముల వాడో


అధ్యక్షుడిగా కూర్చుంటే


ఆనందంగా వుంటుంది


అమెరికన్ డాలర్ మీద


నీలి గాయకుడు


పాల్ రాబ్సన్ బొమ్మ వేస్తే


అర్ధవంతంగా వుంటుంది



ఒబామా!


ఒబామా!


తెల్లపుట్టను


చీల్చి పుట్టిన


నల్ల నాగుబామా!


కవుల స్వప్నం నిజం చేసిన


నల్ల సార్వభౌమా !


నమస్కార మందుకో


ఓ నీలి చందమామా!




-ఎండ్లూరి సుధాకర్




(పై మూడు కవితలు 2002 సం.లో 'ఆటా 'ఆహ్వానం పై అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఆశువుగా చెప్పిన కవితలు )




5 comments:

సుజాత వేల్పూరి said...

"నిగ్గరుగా బిగ్గరుగా పిలువబడిన వాడా"
"తెల్ల పుట్టను చీల్చి పుట్టిన నల్ల నాగుబామా"..అమ్మో!

ఆశువుగా చెప్పానని మీరు చెప్పకపోతే నమ్మేదాన్ని కాదు. ఎంతో మధనపడి పడి రాసినట్టున్నాయి ప్రతి లైనూ!

కుంటా కింటే గుర్తొచ్చాడు.

Yendluri Sudhakar ఎండ్లూరి సుధాకర్ said...

సుజాత గారూ!
మీది బ్లాగు బ్లాగు.మీ బ్లాగోతం నచ్చింది.మీ స్పందన కొత్త శక్తినిచ్చింది.
అభినందనల్తో -మీ
ఎండ్లూరి సుధాకర్ .

sriram velamuri said...

ప్రియమైన సుధాకర్ ,హేమలత గార్లకు,చాలారోజుల తరువాత మీ పేర్లు చూసి ఆనందించాను. వర్తమానం ఎన్ని సార్లు చదివానో ....సహచరి ,గూర్కా ల కోసం ....ఇదంతా చాలా రోజుల క్రితం ....మానస,మందారలకు నా జ్ఞాపకాలు ఆన్నవాక్యం నేను ఎప్పుడూ యూజ్ చేస్తుంటాను .
వీలుంటే రాజమండ్రి లో కలుస్తాను ...వర్తమానం తర్వాత అంత గొప్ప కవితలు చదవలేదు.please call me at 90000 30088 or sms ur phone no

Yendluri Sudhakar ఎండ్లూరి సుధాకర్ said...

మిత్రమా!
వెలమూరి!
మీ లేఖతో
మనసు పొలమారి
పరవశించింది .

-మప్పిదాలతో ....
- మీ
ఎండ్లూరి సుదాకర్

Anandakiran said...

సర్,
బిగ్గరు గా,
అనే మాట "బెగ్గరు" గా అని అర్ధమా లేక "బిగ్గరగా" అని అర్ధమా.
సరిచేయగలరు