బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Monday, October 4, 2010

వరాన్వేషణ




ప్రవరాఖ్యుడు కాకపోయినా
ఫరవా లేదనిపించాలి
కుబేరుడు కాకపోయినా
నగలను కుదవబెట్టనివాడు కావాలి
సత్యవంతుడు కాకపోయినా
నిత్య సంతోషితుడూ
మా అమ్మాయికి హితుడు, సన్నిహితుడు కావాలి

మోహించేవాడే తప్ప
దహించేవాడక్కరలేదు
ముఖాన్ని ముద్దులాడాలి కానీ
మొహం మీద యాసిడ్ పోసేవాడు వద్దు
పంచభక్ష్యాలు పెట్టకపోయినా
కంచంలో ముద్దల్ని కలిపి పెట్టేవాడు కావాలి
కాకరకాయ కూరనైనా
కళ్లకద్దుకుని తినే తీపి మనసువాడు కావాలి

నడివీధిలో విడిచే బండజాతివాడు కాదు
గుండెల్లో దాచుకునే దయ్రార్దహృదయుడు కావాలి
తేనీటిని కన్నీటిని చెరిసగంగా
పంచుకునే రాజహంస కావాలి
మంటల్లో తగలబెట్టేవాడు కాదు
మా అమ్మాయి వెన్నెల విరహాగ్నిని చల్లబరిచేవాడు కావాలి

ఎప్పుడూ డబ్బు లెక్కపెట్టేవాడు కాదు
అప్పుడప్పుడు ఆరుబయట
మల్లెపూల కళ్లతో నక్షత్రాలు గుణించేవాడు కావాలి
కొంచెం సంగీతం తెలియాలి
ఇంకొంచెం సాహిత్యం చదవాలి
మా అమ్మాయి ప్రతి సమయాన్ని రసమయం చేయాలి

ఎప్పుడైనా
మా అమ్మాయి ఎడమకాలితో తన్నినా
ఏమీ అనుకోని సరసుడు కావాలి
ఏడడుగుల బంధంతో ఏడిపించేవాడు కాదు
ఎప్పుడూ నవ్వించే స్నేహితుడు కావాలి
అబ్రహాము శారాల్లా
అపురూప దంపతుల్లా ఉండాలి
ఒక జీవితకాలం తోడుగా నిలవాలి

మా అమ్మాయితో కలసి జీవించేవాడే కాదు
నవ్వుతూ నరకానికైనా వెళ్లేవాడు కావాలి
మా అమ్మాయిని ముంతాజ్‌లా చూసుకోకపోయినా
అనార్కలీలా సజీవ సమాధి చేయనివాడు కావాలి
పిడికిట తలంబ్రాలు పట్టేవాడే తప్ప
కత్తులు కటారులు పట్టే కసాయి కాకూడదు
ధారణాయంత్ర ధురీణుడు కాకపోయినా
సాధారణ ఉద్యోగియైనా అభ్యంతరం లేదు
అమెరికా వాడో
ఐరోపావాడో అక్కర్లేదు
తెలుగువాడైతే చాలు
మీ దృష్టిలో ఎవరైనా ఉంటే
మా అమ్మాయికి సరిపడే
వరుణ్ణి వెతికి తెస్తారా
వంద వచన కవితల సంపుటి అంకితమిస్తాను
ఇన్ని మాటలెందుకుగానీ
మా అమ్మాయిని భరించే మంచి బకరా కావాలి

- ఎండ్లూరి సుధాకర్

ఆదివారం  ఆంధ్ర జ్యోతి అనుబంధం  3 .10 .2010  

Thursday, September 16, 2010

తెలుగు రుబాయీలు



*ఉత్తరం అందగానే హృదయం కంపించింది
అక్షరమక్షరం లో   ఆమె రూపు కనిపించింది
మేఘంలా ఆమె ముందు వాలిపోయి వసీరా!
జల్లు జల్లుగా  కురవాలని అనిపించింది.
   
*ఇన్నాళ్ళకు చూసినందుకేమో  ఏడుపు ఆగటం లేదు
వెళ్లి పలకరిద్దామంటే అడుగు సాగటం లేదు
ఊరుకో బేల హృదయమా ! ఊరుకో
ఎంత కప్పి పెడుతున్నా గాయం దాగటం లేదు .

*ఒకేసారి ఇద్దరిని  కట్టుకున్నాడు
ఇద్దరికీ తెలియకుండా తృతీయను పెట్టుకున్నాడు
కొమ్మలిద్దరు మొగుణ్ణి కోర్టుకీడ్చితే
గొల్లుమంటూ తల గోడకేసి కొట్టుకున్నాడు .

*కలిసి చచ్చి పోదామంది  కలికి
పడ్డాడు ప్రియుడు అదాటున ఉలికి
నీకూ నీ ప్రేమకూ నమస్కారం  ప్రియ మణీ!
బ్రతుకు జీవుడా !అన్నాడు శుభం పలికి .

 -ఎండ్లూరి సుధాకర్

Saturday, September 11, 2010

తెలుగు రుబాయీలు


*సదా  నా  హృదయం  నిన్నే  స్మరిస్తోంది
నీ జ్ఞాపకాల దీపంతో చీకట్లో చరిస్తోంది
తొలినాటి తీపి వలపు  తొలగిపోదు నేస్తమా!
నిన్ను  తలచుకున్నప్పుడల్లా  నా జన్మ తరిస్తోంది .

*మినుములతో ఆ మిటారి  మిద్దె మీదికొచ్చింది
వస్తూ వస్తూ వెంట పీట కూడా తెచ్చింది
ఆమె పీటనైనా కాకపోతినేనని
ఉన్న పళంగా దుఃఖం తన్నుకొచ్చింది .

*ఒక్క ముద్దు కోసం యుగాలైనా ఆగుతాను
ఆమె పొందు కోసం యోజనాలు సాగుతాను
మూడు ముళ్ళు పడితేనే సుఖం కదా సుధాకర్!
అంత వరకు విరహం లో వీణనై మోగుతాను.

*ఆమె నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది
పూర్తిగా తగిలేలా పూల బాణం వేసింది
మత్తు దిగి చూస్తే ఏముంది మహెజబీన్?
పెళ్లి పంజరం లో వెచ్చగా పడవేసింది.


-ఎండ్లూరి సుధాకర్
నవ్య, సెప్టెంబర్ 1 , 2010