Tuesday, September 28, 2010
Thursday, September 16, 2010
తెలుగు రుబాయీలు
*ఉత్తరం అందగానే హృదయం కంపించింది
అక్షరమక్షరం లో ఆమె రూపు కనిపించింది
మేఘంలా ఆమె ముందు వాలిపోయి వసీరా!
జల్లు జల్లుగా కురవాలని అనిపించింది.
*ఇన్నాళ్ళకు చూసినందుకేమో ఏడుపు ఆగటం లేదు
వెళ్లి పలకరిద్దామంటే అడుగు సాగటం లేదు
ఊరుకో బేల హృదయమా ! ఊరుకో
ఎంత కప్పి పెడుతున్నా గాయం దాగటం లేదు .
*ఒకేసారి ఇద్దరిని కట్టుకున్నాడు
ఇద్దరికీ తెలియకుండా తృతీయను పెట్టుకున్నాడు
కొమ్మలిద్దరు మొగుణ్ణి కోర్టుకీడ్చితే
గొల్లుమంటూ తల గోడకేసి కొట్టుకున్నాడు .
*కలిసి చచ్చి పోదామంది కలికి
పడ్డాడు ప్రియుడు అదాటున ఉలికి
నీకూ నీ ప్రేమకూ నమస్కారం ప్రియ మణీ!
బ్రతుకు జీవుడా !అన్నాడు శుభం పలికి .
-ఎండ్లూరి సుధాకర్
Saturday, September 11, 2010
తెలుగు రుబాయీలు
*సదా నా హృదయం నిన్నే స్మరిస్తోంది
నీ జ్ఞాపకాల దీపంతో చీకట్లో చరిస్తోంది
తొలినాటి తీపి వలపు తొలగిపోదు నేస్తమా!
నిన్ను తలచుకున్నప్పుడల్లా నా జన్మ తరిస్తోంది .
*మినుములతో ఆ మిటారి మిద్దె మీదికొచ్చింది
వస్తూ వస్తూ వెంట పీట కూడా తెచ్చింది
ఆమె పీటనైనా కాకపోతినేనని
ఉన్న పళంగా దుఃఖం తన్నుకొచ్చింది .
*ఒక్క ముద్దు కోసం యుగాలైనా ఆగుతాను
ఆమె పొందు కోసం యోజనాలు సాగుతాను
మూడు ముళ్ళు పడితేనే సుఖం కదా సుధాకర్!
అంత వరకు విరహం లో వీణనై మోగుతాను.
*ఆమె నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది
పూర్తిగా తగిలేలా పూల బాణం వేసింది
మత్తు దిగి చూస్తే ఏముంది మహెజబీన్?
పెళ్లి పంజరం లో వెచ్చగా పడవేసింది.
-ఎండ్లూరి సుధాకర్
నవ్య, సెప్టెంబర్ 1 , 2010
Subscribe to:
Posts (Atom)