కూర్చున్న తల్లికి
కూటి కోసం
కూలి పనికెళ్లే రోజులు
గుర్తొచ్చాయి
కన్న పేగులు
కంటి తీగలై
తడి రెప్పల మీద పాకుతున్నాయి.
దుఃఖాన్ని
దూలానికి కట్టెయ్యలేము
దూరాన్ని దోసిళ్లలో తెచ్చుకోలేము.
వలస పోయిన
డాలరు దూడల కోసం
ఆవులాంటి అమ్మకు
కన్ను మూసినా
తెరచినా
మనసు మాత్రంకొట్టం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది
గడ్డిమోపు కాదు కదా!
నెత్తిన పెట్టుకొని రావటానికి
పచ్చబొట్టు కాదు కదా!
మణి కట్టుమీద పొడిపించుకొని తేవడానికి
నా కొడుకు
చిన్నప్పుడు చెట్టుకు కట్టిన ఉయ్యాలలో
చింత చిగురులా ఊగుతూ ఉంటే
ఏ చింతా లేకుండా ఉండేది
నా కూతురు
కొంగు కొమ్మకు వేలాడుతూ ఉంటే
ఎంత భద్రంగా ఉండేది.
కొడుకా జాగ్రత్త
బిడ్డా పదిలం తల్లీ
దేశం కాని దేశంలో
దుర్మార్గుల ద్వేషంలో
తుపాకులతో జాగ్రత్త
తూటాలతో జాగ్రత్త
-ఎండ్లూరి సుధాకర్
1 comment:
This is the grate expretion.Than Q sir
Post a Comment