బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Monday, January 19, 2009

తెలుగు రుబాయీలు


వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు

దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు

జాతికింత అవమానం జరుగుతు వున్నా

జనం లో రగులుతున్న అగ్గే లేదు .



ఆడవాళ్ళ చట్టాలను కాపాడాలి

ఇరుగు పొరుగు వారికొరకు పోరాడాలి

దెబ్బతినే దేశమాత దేహం చూసి

దేవుడైన ఆమె వైపు నిలబడాలి .



భయం వేస్తున్నదమ్మా భైంసా

మధ్య యుగాల నాటి మత హింస

గుండె బాదుకుంటూ అరుస్తోంది

గూడు కాలిన నల్లహంస.




రాతి దేవుళ్ళకు నమస్కరిస్తాడు

బాబాలను బహుగా సత్కరిస్తాడు

యాచకులెవరైనా 'అయ్యా' అంటే

ఛీ పొమ్మని ఆ భక్తుడు ఛీత్కరిస్తాడు.


కాపీ కొట్టిందని ఎగబడి పట్టుకున్నారు

కళాశాల పరువు తీసిందని కసిగా తిట్టుకున్నారు

ఈ కార్పొరేట్ కంసులంతా కలిసి

బంగారం లాంటి బాలికను పొట్టన పెట్టుకున్నారు .



ఆమె మొదట్లో ఒక పువ్వనుకున్నాను

ఏమీ తెలియని గూటి గువ్వనుకున్నాను

మైకు ముందు నిలబడ్డాకే తెలిసింది

ఆమె నిజంగా ఒక నిప్పు రవ్వనుకున్నాను.




-ఎండ్లూరి సుధాకర్

4 comments:

Bolloju Baba said...

గురువుగారూ
నమస్కారం సార్
నేను మీ అభిమానినండీ
మిమ్ములను ఇలా బ్లాగులోకంలో చూడటం ఆనందంగా ఉండి సార్.
భవదీయుడు
బొల్లోజు బాబా

Yendluri Sudhakar ఎండ్లూరి సుధాకర్ said...

మిత్రమా!బొల్లోజు బాబా!
నీ ప్రశంస నా కవిత్వానికే ఒక కొత్తశోభ.
అభినందనలతో.....
ఎండ్లూరి సుధాకర్

సుజాత వేల్పూరి said...

సుధాకర్ గారు,నమస్తే !

ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. మీరూ బ్లాగడం మొదలెట్టినందుకు! బాబాగారు ముందు చెప్పేసారు గానే నేను మీ అభిమానిని అనేది చిన్న మాట. మీరు రాసిన ఘూర్ఘా కవిత ఉదయం ఆదివారం ఎడిషన్ లో ఎప్పుడో 90'ల్లో వచ్చిన దాన్ని కత్తిరించి దాచుకుని ఆ మధ్య నా బ్లాగులో కూడా పెట్టాను దాన్ని. మధ్యలో చాలా రోజులు రాసినట్టు లేదు మీరు. ఆ మధ్య నవ్య లో అనుకుంటా "లేడీస్ హాస్టల్" మీద ఒక కవిత రాశారు కదూ!

మనసుకు పట్టిన తుప్పు వదిలిపోయేలా మంచి కవితలు అందిస్తారని అత్యాశ పడుతున్నాను. బొల్లోజు బాబా గారు కూడా మంచి కవి. నేను ఘూర్ఖా కవిత నా బ్లాగులో పెడితే ఎలా స్పందించారో చూడండి, ఈ లింక్ లో!

http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_21.html

Anonymous said...

సుధాకర్ గారు
మీ బ్లాగు బాగుంది