బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Thursday, December 24, 2009

Wednesday, May 27, 2009

నజరానా {ఉర్దూ కవితలు}


*పనిగట్టుకొని ఆమె చిత్రపటాన్ని
పది మందికీ చూపించాను
ప్రతి ఒక్కడితో ఇప్పుడు
పగను కొని తెచ్చుకున్నాను
-ఆజాద్


*నీకు చాలా దూరంలో ఉన్నాను
నీ మీదే మనసు పెట్టుకున్నాను
నీ చిరునామా దొరికినా దొరక్కపోయినా
నీ కోసం మాత్రం నీరీక్షిస్తూనే ఉంటాను
-వహషత్ కలకత్తవీ


*మనసుతో చెప్పే వాణ్ని
అలాంటి బాటలో నడవద్దని
ఎదురు దెబ్బలుతిని పడింది
అనుకున్నాను తగిన శాస్తి జరిగిందని
-అష్రఫ్ రాహాబ్

తెలుగు అనువాదం :ఎండ్లూరి సుధాకర్

Wednesday, April 22, 2009

నజరానా!(ఉర్దూ కవితలు)


*ఇవాళ హృదయాన్ని

దివాళా తీసి కూర్చున్నాను

కొంత సంతోషమూ దొరికింది

కొంత దు:ఖమూ మిగిలింది

-జిగర్


*అందరూ నాకే చెబుతారు

బుద్ధిగా తలొంచుకుని నడవాలని

ఆమెకెందుకు చెప్పరు మరి ?

ముస్తాబై మా బస్తీలోకి రావద్దని

- అక్బర్ ఇలాహాబాదీ

*కలుసుకుందాం అనే మాట

అలవోకగా అనేసింది

ఎక్కడ? అని అనేసరికి

'కలలో' అంటూ కదిలిపోయింది

-అమీర్ మీనాయీ

*సిగ్గులొలుకుతూ

నా సన్నిధిలో తాను

ఆమె దగ్గరున్నంత సేపూ

నేను నేనులో లేను


- జిగర్

*నా పేరు ఆమె కళ్ళల్లో

భద్రంగా రాసి వుంది

బహుశా ఏ కన్నీరో

దాన్ని చెరిపేసి ఉంటుంది

-బషీర్ బద్ర్

*కాశ్మీరు పూలమీద

మంచు బిందువులు నర్తిస్తున్నాయి

మరి ఎక్కడ నుండి

ఈ రక్తపు చినుకులు వర్షిస్తున్నాయి?

-రఫిక్ గిరిధర్ పురీ



తెలుగు అనువాదం:డా:సుధాకర్ ఎండ్లూరి

Sunday, April 5, 2009

నజరానా!(ఉర్దూ కవితలు)


*నువ్వే రానప్పుడు

నీ ఊహలతో పనేంటనీ

దయతో వాటికి చెప్పవూ

వచ్చే శ్రమ తీసుకో వద్దనీ.


-జిగర్ మురాదా బాదీ


*ఉదయ సంధ్య వేళ

మధువు పుచ్చుకుంటున్నాను

మతాధిపతీ! నన్నాపొద్దు

ఉపాసన కోసం ఆత్మను సిద్ధం చేస్తున్నాను.


-ఆదమ్‌


*ఆ భోగినీ విలాసం చూడండి

హృదయ తాపం రగిలించి

చూపులు కలపకుండానే చెక్కేసింది

ముసి ముసి నవ్వులు కురిపించి .....


-జిగర్ మురాదాబాదీ


అనువాదం: ఎండ్లూరి సుధాకర్ ,( వర్ణ చిత్రం లో -జిగర్ మురాదా బాదీ )

Friday, March 20, 2009

నజరానా(ఉర్దూ కవితలు)


*బతుకంతా నీ కోసం

పరితపిస్తూ జీవించా

ఎదురు చూపులు చూస్తూ

ఎందరినో ప్రేమించా

-హఫీజ్ హొషియార్ పురీ


*ఆకులకీ గడ్డి పరకలకీ

అవగతమే నా దుస్థితి

తోటకంతా తెలుసు గానీ

తెలియందల్లా పూలకే నా గతి


_ మీర్ తకీ మీర్


*నా కన్నీటి కబురు

ఆమె చెవిదాకా ఎవరు చేర్చారు?

నా గుండె గుట్టు నలుగురిలో

ఎవరు సుమా రచ్చకీడ్చారు ?

_నాతిక్ గులావఠీ


తెలుగు అనువాదం :డా.ఎండ్లూరి సుధాకర్

Friday, March 6, 2009

దు:ఖ గంధకికామ్ల వర్షం



ఈ మధ్య గమనిస్తున్నాను

మా అమ్మాయిలు అదోలా ఉంటున్నారు

భద్రంగా ఉన్నట్టులేరు

ఏ యువకుడు కనబడినా

ఏ వాహన శబ్దం వినబడినా

ఊరికే ఉలిక్కి పడుతున్నారు

పులిని చూసిన జింకల్లా బెదిరిపోతున్నారు

బజారుకెళ్లాలంటే భయపడుతున్నారు

కాలేజీ కెళ్లమంటే కంగారు పడుతున్నారు

కారణాలడిగితే కన్నీటి మేఘాలౌతున్నారు

ఆకాశం ప్రతిధ్వనించేలా నవ్విన వాళ్లు

గలగల గోదారిలా మాట్లాడిన వాళ్లు

నీరింకిన చలమలౌతున్నారు

మేత ముట్టని దూడల్లా

మెత్తబడుతున్నారు

ఏ దిగులు తీగలకో చిక్కుకొని

పగలూ రాత్రీ కునారిల్లుతున్నారు

రోజుకు నాలుగు సార్లు

బండితీసి చక్కర్లు కొట్టేవాళ్లు

స్నేహితుల్ని వెనకెక్కించుకొని

వీథుల్ని వీర విహారం చేసేవాళ్లు

రెండు పదుల వయసొచ్చినా

మా కంటికి రెండేళ్ల పిల్లల్లాగే కనిపిస్తారు

యవ్వనపు టెన్నిస్ కోర్టులో

సానియా మీర్జాలా

దర్జాగా ఆడుకుంటూ కనిపిస్తారు

ఇప్పుడు పెద్దగా బైటికెళ్లడం లేదు

ఇంటిపట్టునే ఉండిపోతున్నారు

వార్తలు చూస్తే చాలు

వణికి పోతున్నారు

కాలిన గొంతులు వినబడితే

కంటతడి పెడుతున్నారు

మా అమ్మాయిల్ని చూస్తే

మహా బెంగగా ఉంది

అమ్మా! ఏం కావాలో చెప్పండి

మీకేం తేవాలో అడగండని

గుచ్చి గుచ్చి ఆరాతీస్తే

గుడ్లల్లో నీళ్లు గుక్కుకుంటూ

ఇలా అన్నారు.

"నాన్నా!

మాకు యాసిడ్ ప్రూఫ్ ముఖాలు కావాలి

తెచ్చిపెట్టగలవా?!...''



-ఎండ్లూరి సుధాకర్

Saturday, February 21, 2009

నజరానా (ఉర్దూ కవితలు)-5


*మొత్తం ఆ వీధికంతా
నా ఒక్క కొంప లోనే దీపం లేంది
ఆ చీకటే చాలు నీకు
నా చిరునామా చెప్పేస్తుంది.

- బాకీ అహమద్ పురీ

*తెల్లారిపోయినా ఆ కొవ్వొత్తి
ఇంకా ఏడుస్తుంది దేనికని ?
"ఇంకొద్దిగా మిగిలాను
ఇది కూడా కరిగిపోవాలని"

-ఆగ్ జాన్‌ 'ఏష్ '

*ఆమె నగ్నసౌందర్యం మీద
పరుచుకున్నాయి కురులు
ఒకే సారి ఉదయించాయి
రేయీ మరియూ పవలూ

- హీరాలాల్ పలక్

*'మనసు ఎలా వుంటోందని '
ఆమె నవ్వుతూ అడిగింది
ఒక కన్నీటి చుక్క దొరలి
అలా నిలిచి పోయింది.

-మహిరూల్ కాదరీ

*ఎలాగైతేనేం? ఆమె కళ్ళు
అశ్రు బిందువులు వర్షించాయి
ఆమె చిరు నవ్వుల బరువు కూడా
ఆ నయనాలు మోయలేక పోయాయి

-ఖామోష్

*వెన్నెలని చూసుకునే కదా
చంద్ర బింబం మిడిసి పడుతోంది
ప్రియా! ఒక్క సారి
నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .

-సాహిల్ మానక్ పురీ



-తెలుగు అనువాదం :ఎండ్లూరి సుదాకర్

Monday, February 9, 2009

నజరానా(ఉర్దూ కవితలు)-4


*నేను అనుకునే వాణ్ణి

ప్రేమంటే ఫ్రణయ కలాపం

ఆ తరువాత తెలిసింది

అది ఒక రుధిర విలాపం .


-అసర్ లఖ్నవీ


*చాలా అందమైనవి నీ కళ్ళు

తెల్లవార్లూ మేలుకోకు

సహజ నిద్ర పడుతుందిలే

నా ఆలోచన రానీయకు .


_హసన్‌ కాజ్మీ


*ఈడ్చుకొని వెళ్ళింది

మనసు నీ దగ్గరికి

ఏం చెప్పాలో చెప్పు ?

అది చేసిన పిచ్చి పనికి .


_ రషీద్ సిద్ధిఖీ


*హాయిగా ఏడ్చుకునే

స్వేచ్ఛ కావాలి ఫానీ

ఇది ఆమె వుండే వీధి

తెలుసుకో !నీ దు:ఖశాల కాదని .


_ఫానీ


*బహుశా వైద్యంతోనైనా

కుదురుకుంటుందేమో చావు

కానీ జీవితాన్ని మాత్రం

బాగు చేసే మందులేవీ లేవు.


_ఫిరాఖ్



*నా పేరు నేల మీద రాసి

మళ్ళీ చెరిపేసింది

ఆమెకది ఒక ఆట

కడకదే నన్ను మట్టి పాలు చేసింది.


-నవాజ్ మహల్ అఖ్తర్


-తెలుగు అనువాదం :ఎండ్లూరి సుధాకర్

Saturday, February 7, 2009

చెరువు లేని ఊరు

అమ్మ లేని అనాధలా

మా ఊరికి చెరువు లేదు

చిన్నప్పుడు

చెరువు చెక్కిళ్ళని ముద్దు పెట్టుకున్న

నీటి జ్ఞాపకాలు కానీ

నీటి మైదానంలో దిసమొలతో
పరుగెత్తిన గాఢ స్మృతులు కానీ

జల వృక్షమెక్కి అలల ఆకుల నడుమ

పిందెలా కదిలిన బాల్య్యానుభూతులు కానీ లేవు.
చెరువు పలక మీద

జలాక్షరాలు దిద్దుకోవాలని

చిన్నప్పుడు ఎంత పలవరించామో

మబ్బుల ఊరేగింపు బయలుదేరినప్పుడల్లా

ఉరుములతో గొంతు కలిపి

ఆరు బయట నీటి నినాదాలు చేసేవాళ్ళం .

జలజలా రాలే తొలకరి చినుకుల్ని

మట్టి నాల్కలు చాపి
పిప్పరమెంటు బిళ్ళళ్లా చప్పరించే

చెరువు మా బాల్య జలస్వప్నం

ఆకాశం కొలిమిగా మారిన అగ్ని రుతువులో

ఒక చెరువు కోసం

ఒక చెలమ కోసం

బొబ్బలెక్కిన కాళ్ళతో కాందిశీకులమయ్యే వాళ్లం

బెత్తికలెత్తి దూపగొన్న మా బతుకులకు

గుక్కెడు మంచినీళ్ళు కూడాదొరికేవికావు

మా గురయ్య తాత కళ్ల గుంటల్లా

'రెండు ' దిగుడుబావులు మాత్రం
దిగులు దిగులుగా కనబడుతుండేవి

ఆకాశం వైపు చేతులు మోడ్చి

మాకో చెరువునియ్యమని ప్రార్ధించాం

భగీరధులమై జలాగ్రహం చేశాం .

ఆకాశం లోకి విల్లు సారించి

మేఘ భాండాల్ని బద్దలు చేయాలనుకున్నాం

రోళ్ళకి కప్పలు కట్టి నీటి పూజలు చేస్తే

వర్షం పడుతుందనుకునే వెర్రి బాల్యం మాది.

ఎప్పుడైనా వర్షమొచ్చిన పొద్దు

మా వూరు జల ప్రవాహపు జాతరవుతుంది .
మళ్లీ మరునాటికి బురద మొహంతో నెర్రలు తీస్తుంది.

ఒకే ఒక్క కుంభవర్షపు తుఫాను రాత్రి
నిజంగానే మా వూరు చెరువయ్యింది.

గుడిసెల మెడల దాకా వూరు మునిగినా

చెరువు ఉయ్యాల లో తేలుతూ

మా కడుపుల్ని చెరువు చేసుకున్నాం .

నిండు నీటిలో మేమంతా

తాబేళ్ళమయ్యాం

కొరమీనులమయ్యాం

చందమామ బేడిస చేపలమయ్యాం

నెమ్మది నెమ్మదిగా చెరువెండిపోతుంటే
అమ్మ దగ్గర పాలైపోయినట్టు మూగ వోయాం

మా వూరు గుర్తుకొచ్చి

నా బాల్యం వీపు నిమిరినప్పుడల్లా

నా తాతముత్తాతల నాటి

మెట్ట పొలం కళ్ళల్లో కదిలినప్పుడల్లా

చెరువు లేని నా పల్లె రూపం

నన్ను నిలువెల్లా నీరు గా మార్చేస్తుంది.

నన్ను చెరువుగా మారమని

మట్టి గొంతుతో నినదిస్తూ వుంటుంది.

-ఎండ్లూరి సుధాకర్

(వర్తమానం నుంచి)

Saturday, January 31, 2009

నజరానా!(ఉర్దూ కవితలు )-3


*ఆమె నా శవయాత్ర నాపి


నిలదీసింది ఇలా!


'నిన్ను మా వీధిలోకి రావద్దన్నాను గానీ


ఈ లోకాన్ని విడిచిపోతే ఎలా?'


-సఫీ



*నా నుంచి శాశ్వతంగా


విడిపోదామనుకుంటున్నావా నువ్వు?


గుర్తుగానైనా ఉండిపోతుంది


వెళ్ళే ముందు నాకో గాయాన్నివ్వు.

-నూర్ ఇందౌరీ



*ఆమె గుర్తుకురాగానే


అలముకున్నాయి అశ్రువులు


జ్ఞాపకాలకెంత దగ్గరో కదా


ఈ కన్నీటి బిందువులు.

-అంజుమ్


*ఆమె తలపుల తన్మయత్వం


నన్ను విడిచి పోదు


తరలిపో మరణమా!


నాకిప్పుడు తీరిక లేదు.

-అజ్ఞాత కవి



*కొందరి సుందరాంగుల చిత్రాలు


మరి కొన్ని వలపుటుత్తరాలు


నేను మరణించాక


ఇవే నా గదిలో దొరికే వస్తువులు.

-గాలిబ్



*ప్రియతమా! ఏం చెప్పను?


నా కన్నీటి బిందువుల తీరు


నిల బడితే నిప్పు


ఒలికి పడితే నీరు .

-ఫానీ బదాయినీ


-తెలుగు అనువాదం: ఎండ్లూరి సుధాకర్


Thursday, January 29, 2009

నజరానా ! (ఉర్దూ కవితలు)-2


*ఎంత పదిలంగా చూసుకున్నా

నా హృదయం నాది కాలేకపోయింది

ఒక్క నీ ఓర చూపు తోనే

అది నీ వశమైపోయింది .

-జిగర్ మురాదాబాదీ


*ఎదురు చూపులకైనా

ఓ హద్దంటూ ఉంటుంది

కడకు వెన్నెల కూడా

కరకుటెండలా మారుతోంది.

-బిస్మాల్ సయూదీ


*ఆమె నా ప్రేమ లేఖ చదివి

అది ఇచ్చిన వాడితో ఇలా అంది

'ఈ జాబుకు బదులివ్వక పోవడమే

నా జవాబ'ని చెప్పింది.

-అమీర్ మీనాయీ


*తనని చూడగోరే వారికి

తరుణం లభించింది

ఆమె తన మేలి ముసుగు

అర మోడ్పుగా తొలగించింది

-అర్ష్ మల్సియాని


*నా కెవరైనా ఎరుక పర్చండి

ఆమెకెందుకు జవాబు చెప్పాలని?

ఆమె నన్ను అడుగుతోంది

'తనని ఎందుకు కోరుకున్నాన'ని ?

- షకీల్ బదాయునీ


*వలపు దారిలో అలసి పోయి

ఎక్కడ నేను చతికిలబడ్డానో

అక్కడ నాకంటే ముందే వచ్చిన

బాటసారుల్ని చూశానెందరినో

- బహదూర్ షా జఫర్



అనువాదం : ఎండ్లూరి సుధాకర్


Tuesday, January 20, 2009

నాలుగు నల్ల కవితలు






నల్లవాడా!


నల్లవాడా!


నల్లవాడలోని పిల్ల వాడా


నీలి వజ్రాల నిగనిగల కళ్ళ వాడా!


ఘెట్టోలలో - చీకటి


కొట్టాలలో


బానిస బంధాలలో


గాఢాందకారాలలో


శతాబ్దాలు మగ్గిన వాడా


పోరు చేసి నెగ్గిన వాడా


నిగ్గరుగా


బిగ్గరుగా


పిలవబడిన వాడా


నల్ల రేగడి పోర గాడా


ఏ నాటికైనా


అమెరికాను శాసిస్తావు


బహుశా నువ్వే


శాశ్వతంగా పరిపాలిస్తావు.



*ఘెట్టో - మన వెలి వాడ వంటిది




నీలీ!


పింఛా లాంఛిత


అసిత కిరణ రింఛోళీ


నడిచే నా నల్లకలువల దండా!


నిన్ను నిగ్గర్


అన్నవాడే బెగ్గర్


డార్కీ


నీ అందం


నల్ల సముద్రం మీద


లేత చంద్రోదయం ...


*రింఛోళీ -సమూహం




ఎవరన్నారో గానీ


ఈ వైట్ హౌస్ కి


బ్లాక్ పెయింట్ వేస్తే


భలేగుంటుంది


ఏ నల్లని వాడో


పద్మనయనమ్ముల వాడో


అధ్యక్షుడిగా కూర్చుంటే


ఆనందంగా వుంటుంది


అమెరికన్ డాలర్ మీద


నీలి గాయకుడు


పాల్ రాబ్సన్ బొమ్మ వేస్తే


అర్ధవంతంగా వుంటుంది



ఒబామా!


ఒబామా!


తెల్లపుట్టను


చీల్చి పుట్టిన


నల్ల నాగుబామా!


కవుల స్వప్నం నిజం చేసిన


నల్ల సార్వభౌమా !


నమస్కార మందుకో


ఓ నీలి చందమామా!




-ఎండ్లూరి సుధాకర్




(పై మూడు కవితలు 2002 సం.లో 'ఆటా 'ఆహ్వానం పై అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఆశువుగా చెప్పిన కవితలు )




Monday, January 19, 2009

తెలుగు రుబాయీలు


వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు

దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు

జాతికింత అవమానం జరుగుతు వున్నా

జనం లో రగులుతున్న అగ్గే లేదు .



ఆడవాళ్ళ చట్టాలను కాపాడాలి

ఇరుగు పొరుగు వారికొరకు పోరాడాలి

దెబ్బతినే దేశమాత దేహం చూసి

దేవుడైన ఆమె వైపు నిలబడాలి .



భయం వేస్తున్నదమ్మా భైంసా

మధ్య యుగాల నాటి మత హింస

గుండె బాదుకుంటూ అరుస్తోంది

గూడు కాలిన నల్లహంస.




రాతి దేవుళ్ళకు నమస్కరిస్తాడు

బాబాలను బహుగా సత్కరిస్తాడు

యాచకులెవరైనా 'అయ్యా' అంటే

ఛీ పొమ్మని ఆ భక్తుడు ఛీత్కరిస్తాడు.


కాపీ కొట్టిందని ఎగబడి పట్టుకున్నారు

కళాశాల పరువు తీసిందని కసిగా తిట్టుకున్నారు

ఈ కార్పొరేట్ కంసులంతా కలిసి

బంగారం లాంటి బాలికను పొట్టన పెట్టుకున్నారు .



ఆమె మొదట్లో ఒక పువ్వనుకున్నాను

ఏమీ తెలియని గూటి గువ్వనుకున్నాను

మైకు ముందు నిలబడ్డాకే తెలిసింది

ఆమె నిజంగా ఒక నిప్పు రవ్వనుకున్నాను.




-ఎండ్లూరి సుధాకర్

Thursday, January 15, 2009

నజరానా(ఉర్దూ కవితలు)



నిన్నొకసారి చూస్తే చాలు

ఆ కళ్ళు అలా మూసుకుపోతాయి

ఒక్కసారి నీ రూపాన్ని చూశాక

ఇంకా అవి దేన్ని చూస్తాయి

-వహషత్ కలకత్తవీ


జీవితంలో అందరూ ప్రేమిస్తారు

ప్రాణేశ్వరీ !మరణించినా నిన్నేస్మరిస్తుంటాను

నిన్నొక ఊపిరిలా గుండెల్లో పదిలపరిచాను

నిన్ను అదృష్ట రేఖల్లోంచి దొంగిలించాను.

-ఖతీల్ షిఫాయీ



నేనూ మౌనంగా వున్నాను

తానూ నిశ్శబ్దంగా వుంది

ఒక నాజూకు విషయమేదో

మా మధ్యన నలుగుతోంది

-ముల్లా


నా కనీళ్ళని నేను

చప్పరిస్తున్నా కూడా

లోకమంటోంది ఇలా

"వీడు తాగుబోతు గాడా"?

-నరేష్ కుమార్ 'షాద్'


నీ ప్రతి ఓర చూపూ

నిజంగా అది నాకు

ఒక బాణం ఒక ఖడ్గం

ఒకప్పుడది పిడి బాకు

-సాజన్ పెషావరీ


సర్వేశ్వరా!నువ్వు సృష్ఠించిన

సుందరాంగుల్ని చూస్తే ఇలా అనిపిస్తుంది

ఏ ముఖాన్ని చూసినా వెంటనే

హృదయానికి హత్తుకోవాలనుంటుంది

-అక్బర్ ఇలాహాబాదీ


తెలుగు అనువాదం:డా.ఎండ్లూరి సుధాకర్