బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Saturday, February 7, 2009

చెరువు లేని ఊరు

అమ్మ లేని అనాధలా

మా ఊరికి చెరువు లేదు

చిన్నప్పుడు

చెరువు చెక్కిళ్ళని ముద్దు పెట్టుకున్న

నీటి జ్ఞాపకాలు కానీ

నీటి మైదానంలో దిసమొలతో
పరుగెత్తిన గాఢ స్మృతులు కానీ

జల వృక్షమెక్కి అలల ఆకుల నడుమ

పిందెలా కదిలిన బాల్య్యానుభూతులు కానీ లేవు.
చెరువు పలక మీద

జలాక్షరాలు దిద్దుకోవాలని

చిన్నప్పుడు ఎంత పలవరించామో

మబ్బుల ఊరేగింపు బయలుదేరినప్పుడల్లా

ఉరుములతో గొంతు కలిపి

ఆరు బయట నీటి నినాదాలు చేసేవాళ్ళం .

జలజలా రాలే తొలకరి చినుకుల్ని

మట్టి నాల్కలు చాపి
పిప్పరమెంటు బిళ్ళళ్లా చప్పరించే

చెరువు మా బాల్య జలస్వప్నం

ఆకాశం కొలిమిగా మారిన అగ్ని రుతువులో

ఒక చెరువు కోసం

ఒక చెలమ కోసం

బొబ్బలెక్కిన కాళ్ళతో కాందిశీకులమయ్యే వాళ్లం

బెత్తికలెత్తి దూపగొన్న మా బతుకులకు

గుక్కెడు మంచినీళ్ళు కూడాదొరికేవికావు

మా గురయ్య తాత కళ్ల గుంటల్లా

'రెండు ' దిగుడుబావులు మాత్రం
దిగులు దిగులుగా కనబడుతుండేవి

ఆకాశం వైపు చేతులు మోడ్చి

మాకో చెరువునియ్యమని ప్రార్ధించాం

భగీరధులమై జలాగ్రహం చేశాం .

ఆకాశం లోకి విల్లు సారించి

మేఘ భాండాల్ని బద్దలు చేయాలనుకున్నాం

రోళ్ళకి కప్పలు కట్టి నీటి పూజలు చేస్తే

వర్షం పడుతుందనుకునే వెర్రి బాల్యం మాది.

ఎప్పుడైనా వర్షమొచ్చిన పొద్దు

మా వూరు జల ప్రవాహపు జాతరవుతుంది .
మళ్లీ మరునాటికి బురద మొహంతో నెర్రలు తీస్తుంది.

ఒకే ఒక్క కుంభవర్షపు తుఫాను రాత్రి
నిజంగానే మా వూరు చెరువయ్యింది.

గుడిసెల మెడల దాకా వూరు మునిగినా

చెరువు ఉయ్యాల లో తేలుతూ

మా కడుపుల్ని చెరువు చేసుకున్నాం .

నిండు నీటిలో మేమంతా

తాబేళ్ళమయ్యాం

కొరమీనులమయ్యాం

చందమామ బేడిస చేపలమయ్యాం

నెమ్మది నెమ్మదిగా చెరువెండిపోతుంటే
అమ్మ దగ్గర పాలైపోయినట్టు మూగ వోయాం

మా వూరు గుర్తుకొచ్చి

నా బాల్యం వీపు నిమిరినప్పుడల్లా

నా తాతముత్తాతల నాటి

మెట్ట పొలం కళ్ళల్లో కదిలినప్పుడల్లా

చెరువు లేని నా పల్లె రూపం

నన్ను నిలువెల్లా నీరు గా మార్చేస్తుంది.

నన్ను చెరువుగా మారమని

మట్టి గొంతుతో నినదిస్తూ వుంటుంది.

-ఎండ్లూరి సుధాకర్

(వర్తమానం నుంచి)

2 comments:

vrdarla said...

అద్భుతమైన కవిత

ప్రభు said...

సుధాకర్ గారూ !
ఈ వూరే కాదు ఒకప్పుడు మాగాణి భూములున్న ఊళ్ళు కూడా ఇప్పుడు నాలుకలు బయటకు పెట్టి నీటికోసం తపిస్తున్నాయ్ ! జల వనరులను జాతీయం చేయని మనం ఇప్పుడు పెరిగిన ప్రాంతీయ వాదంతో పరితపిస్తున్నాం ! ఈ జలదాహం పెరుగేదే కానీ తీరేది కాదు ! ఇంక ముందు యుద్దాలు జల యుద్దాలే అంట !
మీ వూరు కళ్ళకు కట్టింది మీ కవితతో మా వూరులా !